Mixed Dal Janthikalu : మనం తయారు చేసుకునే వివిధ రకాల పిండి వంటకాల్లో జంతికలు కడా ఒకటి. జంతికలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అయితే మనం జంతికలను తయారు చేయడానికి బియ్యం పిండిని అలాగే శనగపప్పును ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కేవలం శనగపప్పే కాకుండా ఇతర పప్పులను వేసి కూడా మనం ఈ జంతికలను తయారు చేసుకోవచ్చు. ఈ మిక్డ్స్ దాల్ జంతికలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, గుల్ల గుల్లగా ఉండేలా ఈ మిక్డ్స్ దాల్ జంతికలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్డ్స్ దాల్ జంతికల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – రెండు కప్పులు, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, పెసరపప్పు – ఒక టేబుల్ స్పూన్, కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరరిపడా, కారం – టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు.
మిక్డ్స్ దాల్ జంతికల తయారీ విధానం..
ముందుగా కళాయిలో పప్పులను వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండి, ఉప్పు, కారం, ఇంగువ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిని జంతికల గొట్టంలో ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మరీ పెద్దగా కాకుండా జంతికలను వత్తుకోవాలి. ఈ జంతికలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిక్డ్స్ దాల్ జంతికలు తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చక్కగా ఉంటాయి. వేసవికాలంలో పిల్లలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కనుక వారికి ఇలా జంతికలను చేసి ఇవ్వడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించవచ్చు.