Moong Dal Upma : ఉప్మా.. ఈ పేరు చెప్పగానే సాధారణంగా చాలా మంది ఆమడ దూరం పారిపోతారు. ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరు అందులో వివిధ రకాల కూరగాయలు, జీడిపప్పు, పల్లీలు వంటివి వేస్తే తింటారు. అయితే ఉప్మాను మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. పెసర పప్పు వేసి చేసే ఈ ఉప్మాను ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే మూంగ్ దాల్ ఉప్మాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మూంగ్ దాల్ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – ఒక కప్పు (పొట్టు తీసింది), ఉప్పు – ఒక టీస్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, తాళింపు కోసం – నువ్వులు – ఒక టీస్పూన్, ఆవాలు – అర టీస్పూన్, అల్లం తురుము – ఒక చెంచాన్నర, ఉల్లికాడలు – రెండు, ఉల్లిపాయ ముక్కలు – రెండు టీస్పూన్లు, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – అర టీస్పూన్, పచ్చి మిర్చి – మూడు.
మూంగ్ దాల్ ఉప్మాను తయారు చేసే విధానం..
ముందుగా పెసర పప్పుని నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి. తరువాత దాన్ని మెత్తగా రుబ్బాలి. కొద్దిగా ఉప్పు కలుపుకుని ఇడ్లీల పాత్రలో వేసుకుని ఇడ్లీల మాదిరిగా ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఇడ్లీలను తీసుకుని ఏదైనా మాషర్‌తో మెత్తగా రవ్వలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. అందులో ఆవాలు, అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నువ్వులు, పచ్చి మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో మెదిపిన పెసర పప్పు రవ్వ, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఉల్లికాడలు కూడా వేసుకుంటే సరిపోతుంది. దీంతో రుచికరమైన మూంగ్ దాల్ ఉప్మా రెడీ అవుతుంది. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ ఎందులో అయినా తినవచ్చు. భలే రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు.