Munakkaya Masala Kura : మునక్కాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మునక్కాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అయితే తరుచూ చేసే వంటకాలతో పాటు మునక్కాయలతో మనం మసాలా కూరను తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో తయారు చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటితో తినడానికి ఈ మసాలా కూర చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా ఈ కూరను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో మరింత రుచిగా, కమ్మగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాయ మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి – ఒక అంగుళం ముక్క, జీడిపప్పు – 10, ధనియాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్స్, తరిగిన మునక్కాయలు – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లిపేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీస్పూన్స్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక కప్పు, చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మునక్కాయ మసాలా కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు, ఎండుకొబ్బరి, జీడిపప్పు, ధనియాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులో లవంగాల, యాలకులు, దాల్చిన చెక్క వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మునక్కాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు, చింతపండు రసం వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి ముక్కలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగాఉంటుంది. మునక్కాయలతో తరుచూ చేసే వంటకాలతో పాటు ఇలా మసాలా కూర కూడా తయారు చేసుకుని తినవచ్చు.