Mushroom 65 : పుట్ట గొడుగులను తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిని తినడం వల్ల మనకు విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కనుక పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఇక పుట్టగొడుగులను చాలా మంది రకరకాలుగా వండుకుని తింటుంటారు. వీటితో ఏ కూర చేసినా.. ఏ వంటకం వండినా.. రుచిగానే ఉంటుంది. అయితే పుట్టగొడుగులతో మష్రూమ్ 65ని తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీన్ని రెస్టారెంట్లలోనే చేస్తారు. కానీ కాస్త శ్రమిస్తే ఇంట్లోనే దీన్ని ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర కప్పు, పుట్టగొడుగులు – ఒకటిన్నర కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూన్, కారం – రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు, గరం మసాలా – ఒక టీస్పూన్, మొక్కజొన్న పిండి – రెండు టేబుల్ స్పూన్లు, మైదా – నాలుగు టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి – రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా.
మష్రూమ్ 65 ని తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో పెరుగు వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ధనియాల పొడి, ఉప్పు, మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, మైదా వేసి అన్నింటినీ కలుపుకోవాలి. తరువాత అందులో నిమ్మరసం కూడా కలపాలి. ఆ తరువాత పుట్టగొడుగులను వేసి వాటికి పెరుగు మిశ్రమం పట్టేలా కలపాలి. అనంతరం అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత బయటకు తీసి రెండు మూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి బయటకు తీయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ 65 తయారవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా టమాటా సాస్‌తో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. పోషకాలు కూడా లభిస్తాయి.