Mushroom Curry Recipe : మనకు రెస్టారెంట్ లలో లభించే మసాలా కర్రీలల్లో మష్రూమ్ కర్రీ కూడా ఒకటి. మష్రూమ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీని ఇష్టంగా తింటారు. దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా మష్రూమ్ మసాలా కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్టగొడుగులు – 250 గ్రా., జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు – 10 నుండి 15, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయలు – 2( మధ్యస్థంగా ఉన్నవి), సాజీరా – పావు టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, జాపత్రి – కొద్దిగా, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, టమాటాలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – అర గ్లాస్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మష్రూమ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు వేసి నీటిని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పుట్టగొడుగులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత బయటకు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో జీలకర్ర, ధనియాలు వేసి వేడి చేయాలి. తరువాత వీటిని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే జీడిపప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పుట్టగొడుగు ముక్కలు వేసి వేయించాలి. వీటిని కూడా 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మసాలా దినుసులు వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాటపేస్ట్ వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత జీడిపప్పు పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పుట్టగొడుగు ముక్కలు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత కసూరిమెంతి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.