Muskmelon Sharbat : వేసవిలో చాలా మంది శరీరాన్ని చల్లబరుచుకునేందుకు వివిధ రకాల శీతల పానీయాలను, పళ్ల రసాలను ఎక్కువగా తాగుతున్నారు. అయితే ఈ సీజన్ లో మనకు లభించే పండ్లను తింటే వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. వాటిల్లో తర్బూజా కూడా ఒకటి. దీని రుచి చప్పగా ఉంటుంది. కనుక చాలా మంది దీంతో జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. అయితే తర్బూజాలతో షర్బత్‌ను కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తర్బూజా షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తర్బూజా – 1, చక్కెర – 2 టీస్పూన్లు, నీళ్లు – తగినన్ని, సబ్జా గింజలు – 1 టీస్పూన్, సగ్గుబియ్యం – అర కప్పు, పాలు – ఒక కప్పు.
తర్బూజా షర్బత్‌ను తయారు చేసే విధానం..
తర్బూజా పండుపై ఉండే తొక్కను తీసి లోపలి గుజ్జును ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. అవసరం అనుకుంటే నీళ్లను కలుపుకోవచ్చు. అందులోనే చక్కెర కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. సబ్జా గింజలను ఒక టీస్పూన్ తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. సగ్గుబియ్యాన్ని కూడా నీటిలో వేసి ఒక గంట పాటు నానబెట్టాలి. అనంతరం సగ్గుబియ్యాన్ని పాలలో పోసి బాగా మరిగించాలి. తరువాత ముందు సిద్ధం చేసుకున్న తర్బూజా మిశ్రమంలో నానబెట్టిన సబ్జా గింజలు, సగ్గుబియ్యం, పాలు మిశ్రమం వేసి బాగా కలపాలి. మరోసారి వీటిని మిక్సీ పట్టాలి.
దీంతో తర్బూజా షర్బత్ రెడీ అవుతుంది. దీన్ని 2 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన తరువాత తాగాలి. అయితే పలుచగా కావాలనుకుంటే దీంట్లో మరిన్ని నీళ్లను కలుపుకోవచ్చు. ఇక పాలు కలపకుండా నిమ్మరసం వేసి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసినా తర్బూజా షర్బత్ రెడీ అవుతుంది. ఇది వేసవిలో చక్కని ఉపశమనాన్ని అందిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తుంది. కనుక దీన్ని తప్పకుండా తాగాలి. ఒక్కసారి చేస్తే మళ్లీ ఇలాగే కావాలంటారు.