Sweet Potato : పూర్వకాలంలో మన పెద్దలు అనేక ఆహారాలను తీసుకునేవారు. వాటిల్లో శరీరానికి శక్తిని, పోషకాలను అందించే ఆహారాలు ఎక్కువగా ఉండేవి. అలాంటి ఆహారాల్లో చిలగడ దుంపలు కూడా ఒకటి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది వీటిని నేరుగా పచ్చిగానే తింటుంటారు. అయితే చిలగడ దుంపలను పచ్చిగా తినరాదు. వాటిని కింద చెప్పిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. చిలగడ దుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో మనకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
చిలగడదుంపల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఫైబర్, విటమిన్లు ఎ, సి, బి6లతోపాటు పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహార లోపం రాకుండా చూస్తాయి. కనుక చిలగడదుంపలను తప్పకుండా తీసుకోవాలి. వీటిల్లో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి చేరిన తరువాత విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు పరిచి కళ్లను సంరక్షిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
చిలగడదుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే మలబద్దకం ఉండదు. ఈ దుంపలు తియ్యగా ఉంటాయి. అలా అని చెప్పి షుగర్ ఉన్నవారు వీటిని తినాలంటే వెనుకడుగు వేస్తుంటారు. కానీ వాస్తవానికి ఈ దుంపలు ఆలుగడ్డల్లా కాదు. అవి షుగర్‌ను వెంటనే పెంచుతాయి. కానీ చిలగడ దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తిన్నా కూడా షుగర్ వెంటనే పెరగదు. పైగా షుగర్‌ను తగ్గించే సమ్మేళనాలు వీటిల్లో ఉంటాయి. కనుక తియ్యగా ఉన్నా సరే ఎలాంటి భయం లేకుండా చిలగడదుంపలను షుగర్ పేషెంట్లు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఈ దుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. వీటిల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చిలగడదుంపల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిల్లో బీటా కెరోటీన్, ఆంథోసయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ వాపులను, నొప్పులను తగ్గిస్తాయి. దీంతో ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు చిలగడదుంపలను తింటే ఎంతగానో మేలు జరుగుతుంది. తక్కువగా తిన్నా చాలు.. కడుపు నిండిపోతుంది. త్వరగా ఆకలివేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. కనుక ఈ దుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇక ఈ దుంపలను చాలా మంది నీళ్లలో ఉడకబెట్టి తింటుంటారు. అయితే అలా కాకుండా వీటిని నిప్పుల్లో కాల్చి లేదా ఒక పాత్రలో వేసి కాల్చి కూడా తినవచ్చు. ఓవెన్ ఉన్నవారు అందులో ఈ దుంపలను ఉంచి కాల్చి తినవచ్చు. కాలిన తరువాత పైన ఉండే పొట్టు తీయాలి. లోపలి గుజ్జు తినాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. నీటిలో వేసి ఉడకబెట్టిన దుంపల కన్నా ఇలా కాల్చిన దుంపలు ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలా వీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.