Mysore Masala Dosa : దోశను కూడా మనం అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దోశను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మన అభిరుచికి తగినట్టు మనం రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా మనం తయారు చేసే వివిధ రకాల దోశల్లో మైసూర్ మసాలా దోశ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా హోటల్స్ లో, టిఫిన్ సెంటర్లల్లో లభిస్తుంది. ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ మైసూర్ మసాలా దోశను మనం చాలా సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మైసూర్ మసాలా దోశను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ మసాలా దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – అర కప్పు, ఇడ్లీ బియ్యం – ఒక కప్పు, దోశ బియ్యం – ఒక కప్పు, అటుకులు – అర కప్పు, పచ్చి శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
మసాలా కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – రెండు టేబుల్ స్పూన్స్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, నువ్వులు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, నీటిలో నానబెట్టిన కాశ్మీరి మిర్చి – 15, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 4 , నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మైసూర్ మసాలా దోశ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. అలాగే ఇడ్లీ బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో దోశ బియ్యం, మెంతులు, శనగపప్పు వేసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే అటుకులను పిండి పట్టడానికి అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు జార్ లో లేదా గ్రైండర్ లో వేసి వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకుని పిండిని ఒక రాత్రంతా పులియబెట్టాలి. పిండి పులిసిన తరువాత తగినంత పిండిని తీసుకుని అందులో నీళ్లు, ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, నిమ్మరసంతో పాటు వేయించిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకుని అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు పెనాన్ని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక గంటెతో పిండిని తీసుకుని దోశను పలుచగా వేసుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తరువాత దానిపై ఒక టేబుల్ స్పూన్ మసాలా కారాన్ని వేసి దోశ అంతా వచ్చేలా రుద్దుకోవాలి. తరువాత దోశ అంచుల చుట్టూ, దోశ మధ్యలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనెకు బదులుగా నెయ్యి, బటర్ కూడా వేసుకోవచ్చు. దోశ ఎర్రగా కాలిన తరువాత దోశ మధ్యలో బంగాళాదుంప కూరను ఉంచి దోశను మధ్యలోకి మడుచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మైసూర్ మసాలా దోశ తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఇష్టంగా తింటారు. తరచూ చేసే సాధారణ దోశనే కాకుండా ఇలా మైసూర్ మసాలా దోశను కూడా అప్పుడప్పుడూ తయారు చేసుకుని తినవచ్చు.