Oats Dry Fruit Laddu : మనం ఆహారంగా వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ డ్రై ఫ్రూట్స్ కు ఓట్స్ ను కలిపి ఎంతో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. ఆరోగ్యానికి మేలు చేసేలా, రుచిగా డ్రై ఫ్రూట్స్ తో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, తరిగిన బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పిస్తా పలుకులు – ఒక టేబుల్ స్పూన్, పుచ్చగింజలు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – పావు కప్పు, నువ్వులు – పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, కర్జూర పండ్లు – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు.
ఓట్స్ డ్రైఫ్రూట్స్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకులు, పుచ్చగింజలు వేసి వేయించుకోవాలి. తరువాత పల్లీలు వేసి వేయించుకోవాలి. తరువాత నువ్వులు, ఎండుకొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. తరువాత ఓట్స్ వేసి దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లగా అయిన ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిలో యాలకుల పొడిని వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో కర్జూర పండ్లు, బెల్లం తురుము వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇవి అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మరోసారి జార్ లో వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల వేయించిన ఓట్స్ ను వేసి కలుపుకోవాలి. తరువాత తగిన పరిమాణంలో ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకు ఒక లడ్డూ చొప్పున తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పిల్లలకు ఈ లడ్డూను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.