Omelette Attu : మనం సాధారణంగా కోడిగుడ్లతో ఆమ్లెట్ ను వేస్తూ ఉంటాము. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పప్పు,సాంబార్ వంటి వాటితో పాటు కూరలతో కూడా దీనిని సైడ్ డిష్ గా తినంటూ ఉంటాము. చాలా మంది ఆమ్లెట్ ను ఇష్టంగా తింటారు. అయితే కోడిగుడ్లు లేకపోయినా సరే మనం ఆమ్లెట్ ను వేసుకోవచ్చని మీకు తెలుసా.. కోడిగుడ్లు లేకుండా ఆమ్లెట్ ఎలా అని ఆలోచిస్తున్నారా… కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మనం కోడిగుడ్లు లేకుండా కూడా రుచికరమైన ఆమ్లెట్ ను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసే ఆమ్లెట్ చాలా రుచిగా ఉండడంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులభం. కోడిగుడ్లు లేకుండా ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమ్లెట్ అట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కారం – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆమ్లెట్ అట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద కళాయిని ఉంచి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని ఆమ్లెట్ లా వేసుకోవాలి. దీనిని రెండు వైపులా మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆమ్లెట్ అట్టు తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తినవచ్చు. అలాగే బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కోడిగుడ్లు లేకపోయినా సరే మనం రుచికరమైన ఆమ్లెట్ ను తయారు చేసుకుని తినవచ్చు.