Onion Bonda : మనకు బయట బండ్ల మీద సాయంత్రం సమయాల్లో లభించే వాటిల్లో ఇడ్లీ పిండి బొండాలు కూడా ఒకటి. ఇడ్లీ పిండిని ఉపయోగించి చేసే ఈ బొండాలు చాలా రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. ఈ బొండాలను అచ్చం అదే విధంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా చేసుకుని తినడానికి ఈ బొండాలు చక్కగా ఉంటాయి. ఇడ్లీ పిండితో బయట లభించే విధంగా ఉండే బొండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ పిండి బొండాల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ పిండి – 3 కప్పులు, మైదా పిండి – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఇడ్లీ పిండి బొండాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి. బొండాలను తయారు చేసే ఈ ఇడ్లీ పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ ఇడ్లీ పిండిని ఒక కప్పు మినపప్పు, 3 కప్పుల ఇడ్లీ రవ్వతో తయారు చేసుకోవాలి. ఈ కొలతలను పాటించడం వల్ల ఇడ్లీ పిండి బొండాలు కరకరలాడుతూ ఉంటాయి. ఇలా తీసుకున్న ఇడ్లీ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఇడ్లీ పిండిని తగిన పరిమాణంలో తీసుకుంటూ బొండాల ఆకారంలో వేసుకోవాలి.
ఈ బొండాలు కొద్దిగా వేగిన తరువాత మాత్రమే గట్టెతో కదపాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా కరకర అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండితో కూడా బొండాలను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా కరకరలాడుతూ అచ్చం బయట బండ్ల మీద లభించే విధంగా ఉండే ఇడ్లీ పిండి బొండాలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు అదే పిండితో ఇలా సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా బొండాలను వేసుకుని తినవచ్చు.