Onion Samosa : మనలో చాలా మంది ఇష్టంగా తినే చిరు తిళ్లలో సమోసాలు కూడా ఒకటి. సమోసాలను తినని వారు ఉండనే ఉండరు. మనకు రకరకాల రుచుల్లో సమోసాలు దొరుకుతూ ఉంటాయి. వాటిల్లో ఉల్లిపాయ సమోసా కూడా ఒకటి. ఈ ఉల్లిపాయ సమోసాలు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ బయట తయారు చేసే సమోసాలు మంచి వాతావరణంలో తయారు చేయరని, మంచి నూనెలో కాల్చరని మనలో చాలా మంది వాటిని తినడానికి ఇష్టపడరు. అచ్చం బయట దొరికే విధంగా ఉండే ఈ ఉల్లిపాయ సమోసాలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉల్లిపాయ సమోసాలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, అటుకులు – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1, కారం – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
ఉల్లి సమోసా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, తగినంత ఉప్పును, ఒక టేబుల్ స్పూన్ వేడి చేసిన నూనెను వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత గిన్నెపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత మరో గిన్నెలో అటుకులను తీసుకుని వాటిని చేత్తో బాగా నలపాలి. తరువాత ఆ అటుకులల్లో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనాన్ని బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుని పొడి పిండిని వేసుకుంటూ వీలైనంత పలుచగా చపాతీలా వత్తుకోవాలి. ఇలా చపాతీలా వత్తుకున్న దానిని పెనం మీద వేసి 15 సెకన్లలో రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్నింటినీ కాల్చుకున్న తరువాత ఒక దాని మీద ఒకటి ఉంచి కావల్సిన పరిమాణంలో దీర్ఘ చతురస్రాకార పట్టీలుగా కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా మైదా పిండిని తీసుకుని అందులో తగినన్ని నీళ్లను పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒక్కో పట్టిని తీసుకుంటూ సమోసా ఆకారంలో చుట్టి అందులో అటుకుల మిశ్రమాన్ని ఉంచి దాని అంచులకు మైదా పిండి పేస్ట్ ను రాసి సమోసాలను చుట్టుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకున్న తరువాత ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న సమోసాలను వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడే సమోసాలు తయారవుతాయి. ఇలా తయారు చేసుకున్న సమోసాలు బయట దొరికే ఉల్లి సమోసాలలా చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. బయట సమోసాలను తినలేమని అనుకునే వారు ఇలా వీటిని ఇంట్లోనే తయారు చేసి తినవచ్చు.