Palak Pakodi : మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే వాటిల్లో పకోడీలు ఒకటి. పకోడీ ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. మనం వివిధ రకాల పకోడీలను తయారు చేస్తూ ఉంటాం. అందులో పాలకూరతో చేసే పకోడీలు ఒకటి. కేవలం ఉల్లిపాయతో చేసే పకోడీల కంటే పాలకూరను వేసి చేసే పకోడీలు ఇంకా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా పాలకూర వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక పాలకూరతో రుచిగా పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 200 గ్రా., శనగ పిండి – పావు కిలో, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – పావు కిలో, చిన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు – 10, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం పొడి – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా.
పాలక్ పకోడీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలలోని నీరు బయటకు వచ్చేలా చేత్తో బాగా కలుపుకోవాలి. తరువాత తరగిన పాలకూరను వేసి పాలకూరలోని నీరు కూడా బయటకు వచ్చేలా కలుపుకోవాలి. తరువాత శనగ పిండి, పసుపు, కారం, తరిగిన పచ్చి మిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడేలా మరి కొద్దిగా ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి కాగాక ముందుగా కలిపిన ఉల్లిపాయ మిశ్రమాన్ని చిన్న చిన్నగా పకోడిలలా వేసి తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన పకోడీలను టిష్యూలను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ పకోడీలు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా టమాటా కెచప్ తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.