Gulab Jamun : మనం ఇంట్లో రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఉండడమే కాకుండా చాలా తక్కువ సమయంలో చేసుకోగలిగే తీపి పదార్థాలలో గులాబ్ జామున్ ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కొందరికి ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా గులాబ్ జామున్ ను చక్కగా, బయట దొరికే విధంగా తయారు చేసుకోవడం రాదు. ఈ క్రమంలోనే గులాబ్ జామున్ ను బయట దొరికే విధంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గులాబ్ జామున్ మిక్స్ – ఒక ప్యాకెట్, పాలు – పావు కప్పు, చక్కెర – నాలుగు కప్పులు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – 4 కప్పులు, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా.
గులాబ్ జామున్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలోకి గులాబ్ జామున్ మిక్స్ ను వేసి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మూత ఉంచి 30 నిమిషాల పాటు కదలించకుండా ఉంచాలి. ఇప్పుడు కొద్దిగా గుంత ఉండే కళాయిలో నాలుగు కప్పులు నీళ్లు, నాలుగు కప్పుల చక్కెరను వేసి మధ్యస్థ మంటపై చక్కెర కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ మిశ్రమం కొద్దిగా ఉడికిన తరువాత యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచుకోవాలి.
ఇప్పుడు ముందుగా ముద్దగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిశ్రమాన్ని మరోసారి కలుపుకుని కావల్సిన పరిమాణంలో అన్నీ ఒకే విధంగా ఉండేలా గుండ్రటి ముద్దలలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి కాగాక మధ్యస్థ మంటపై ముందుగా ముద్దలలా చేసుకున్న వాటిని వేసి తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర మిశ్రమంలో వేసి చక్కెర మిశ్రమాన్ని చిన్న మంటపై మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండేలా మెత్తగా, ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ తయారవుతుంది. ఇవి చాలా రుచిగా ఉంటాయి.