Palakura Fry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర ఒకటి. పాలకూరలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలకూరతో చేసే వంటకాలను తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాలకూరతో మనం ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ ఫ్రైను చాలా రుచిగా, చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే పాలకూరతో ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన పాలకూర – 4 కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 4 టీ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 6 లేదా కారానికి తగినన్ని, కరివేపాకు – ఒక రెమ్మ, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పాలకూర ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత శుభ్రం చేసుకున్న పాలకూరను వేసి కలపాలి. ఈ పాలకూరను కలుపుతూ దగ్గర పడే వరకు వేయించాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. పాలకూర బాగా వేగి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు ఈ విధంగా పాలకూర ఫ్రైను చేసి పెట్టడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందిచవచ్చు. వారానికి ఒకసారైనా ఈ విధంగా పాలకూరను తీసుకోవడం వల్ల పాలకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.