Dondakaya Fry : మనం దొండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ దొండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో దొండకాయ ఫ్రై ఒకటి. దొండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసిన దొండకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. కొత్తగా మరింత రుచిగా దొండకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన దొండకాయలు – పావు కిలో, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – అర కప్పు, నూనె – డీప్ ప్రైకు సరిపడా, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, కారం – ఒక టేబుల్ స్పూన్.
దొండకాయ 65 తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బజ్జీ పిండిలా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలను వేసి ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి కలుపుకుని బజ్జీలాగా నూనెలో వేసుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ బజ్జీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వేయించుకున్న దొండకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. తరువాత వేయించిన పల్లీలు, జీడిపప్పు, బజ్జీ ముక్కలు, ఎండు కొబ్బరి పొడి వేసి కలపాలి. తరువాత తగినంత ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.