Paneer Kulcha : పనీర్‌ను తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పనీర్‌లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల పాలను తాగలేని వారికి ఇది ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఇక మాంసాహారం తినలేని వారు పనీర్‌ను తినవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీస్లు సైతం సమృద్ధిగా ఉంటాయి. అయితే పనీర్‌తో మనం అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. వాటిల్లో పనీర్ కుల్చా కూడా ఒకటి. సాధారణంగా అయితే రెస్టారెంట్లలో పనీర్ కుల్చాలను తయారు చేస్తారు.
పనీర్‌తో చేసే వంటకాల్లో పనీర్ కుల్చా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని రెస్టారెంట్లలోనే తయారు చేస్తారు. కానీ కాస్త శ్రమిస్తే ఇంట్లోనే ఎంతో టేస్టీగా వీటిని మనం తయారు చేసుకోవచ్చు. ఇక వీటికి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ కుల్చా తయారీకి కావల్సిన పదార్థాలు..
పిండి తయారు చేసేందుకు..
మైదా పిండి – 2 కప్పులు, చక్కెర – 1 టీస్పూన్, ఉప్పు – 1 టీస్పూన్, బేకింగ్ పౌడర్ – 1 టీస్పూన్, బేకింగ్ సోడా – అర టీస్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి లేదా నూనె – 2 టేబుల్ స్పూన్లు, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని.
ఫిల్లింగ్ తయారీ కోసం..
తురిమిన పనీర్ – 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 1 లేదా 2, తరిగిన కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, కారం – అర టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
పనీర్ కుల్చాను తయారు చేసే విధానం..
ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి, చక్కెర, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అందులోనే పెరుగు, నెయ్యి లేదా నూనె వేసి మళ్లీ బాగా కలపాలి. కొంచెం కొంచెంగా గోరు వెచ్చని నీళ్లను కలుపుతూ పిండిని సాగేలా మెత్తగా కలుపుకోవాలి. అనంతరం పిండిని ఒక గిన్నెలో ఉంచి దానిపై ఒక తడి వస్త్రాన్ని కప్పాలి. ఆ పిండిని 2 గంటల పాటు అలాగే ఉంచాలి.
ఒక గిన్నెలో తురిమన పనీర్, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులు, జీలకర్ర, గరం మసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దల్లా చేసి వాటితో పరాటాల్లా మందంగా చేయాలి. అనంతరం వాటిల్లో ముందుగా సిద్ధం చేసుకున్న పనీర్ మిశ్రమాన్ని ఉంచి పరాటాను మూసివేయాలి. మళ్లీ వాటిని చపాతీల్లా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కాస్త నెయ్యి లేదా నూనె వేసి ముందు సిద్ధం చేసుకున్న కుల్చాలను కాల్చుకోవాలి. కుల్చాలపై చిన్నపాటి బబుల్స్ వస్తాయి. కుల్చాలను రెండు వైపులా బాగా కాల్చుకున్న తరువాత పెనం మీద నుంచి తీయాలి. దీంతో వేడి వేడి పనీర్ కుల్చాలు రెడీ అవుతాయి. వీటిని ఏదైనా కూరతో తినవచ్చు. లేదా పెరుగు రైతా, చట్నీతోనూ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి.