Paneer Nuggets : పాలతో చేసే పనీర్ అంటే చాలా మందికి ఇష్టమే. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. నాన్ వెజ్ తినని వారు పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి దేహ నిర్మాణానికి, కండరాల పెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయి. ఇక పనీర్‌ను చాలా మంది వివిధ రకాలుగా వండుతుంటారు. కానీ వీటితో స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటితో చేసే నగెట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే పనీర్ నగెట్స్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ నగెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు..
పన్నీర్ – 200 గ్రాములు, బ్రెడ్ ముక్కలు – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, కారం – టీ స్పూన్, మొక్కజొన్నపిండి – అరకప్పు, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ – సగం, నూనె – తగినంత, కొత్తిమీర తురుము – ఒక టేబుల్ స్పూన్.
పనీర్ నగెట్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇందులో క్యూబ్ షేప్ లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయాలి. తర్వాత బ్రెడ్ ముక్కలను తీసుకుని ఒక పాన్ పై టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు గోధుమ వర్ణంలో వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలను గది ఉష్ణోగ్రతకు చల్లబరచాలి.
ఇప్పుడు మరొక గిన్నెలో మొక్కజొన్న పిండి, మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేయాలి. అలాగే బ్రెడ్ ముక్కలను పొడిగా చేసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ మిశ్రమంలో ఉన్న పన్నీర్ ముక్కలను తీసుకుని బ్రెడ్ పౌడర్ లో అటూ ఇటూ దొర్లించి బాగా వేడి నూనెలో వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఈవిధంగా బంగారు వర్ణంలోకి రాగానే పన్నీర్ నగెట్స్ ను తీయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే పనీర్ నగెట్స్ రెడీ అవుతాయి. వీటిని టమాటా సాస్ తో కలిపి వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని అందరూ ఇష్టపడతారు.