Papad Sabzi : మనం సాధారణంగా అప్పడాలను పప్పు,సాంబార్, రసం వంటి వాటితో సైడ్ డిష్ గా తింటూ ఉంటాము. అప్పడాలను సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే కేవలం సైడ్ డిష్ గా తినడమే కాకుండా ఈ అప్పడాలతో మనం కూరను కూడా తయారు చేసుకోవచ్చు. జైపూర్ స్పెషల్ అయిన ఈ పాప్ సబ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలాగే వెరైటీ రుచులను కోరుకునే వారు ఇలా అప్పడాలతో రుచికరమైన కూరను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పాపడ్ సబ్జీని జైపూర్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాపడ్ సబ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అప్పడాలు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, తరిగిన పెద్ద ఉల్లిపాయ – పెద్దది, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, ఇంగువ – 2 చిటికెలు, కరివేపాకు – 2 రెమ్మలు, టమాటాలు – పెద్దవి రెండు, నీళ్లు – 250 ఎమ్ ఎల్, చిలికిన పెరుగు – అర కప్పు.
పాపడ్ సబ్జీ తయారీ విధానం..
ముందుగా అప్పడాలను నూనెలో వేయించి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, ఇంగువ, కరివేపాకు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసికలపాలి. నీళ్లు మరిగిన తరువాత పెరుగులో అర కప్పు నీళ్లు పోసి మజ్జిగలా చేసుకోవాలి.
తరువాత ఈ మజ్జిగను మరుగుతున్న కూరలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. దీనిని 4 నుండి 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న అప్పడాలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాపడ్ సబ్జీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పరోటా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అప్పడాలతో చేసిన ఈ కర్రీని అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు.