Papparidi : పప్పారిది.. పెసరపప్పు, బియ్యపిండితో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాతకాలంలో తయారు చేసేవారు. ఈ తీపి వంటకాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి బలం కలుగుతుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ చేసే తీపి వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పెసరపప్పుతో కూడా రుచిగా పప్పరిదిని తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పప్పరిదిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పారిది తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, నీళ్లు – 4 కప్పులు, బెల్లం – పావు కప్పు, బియ్యంపిండి – ఒక కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు -ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీస్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
పప్పారిది తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పెసరపప్పును వేసి వేయించాలి. తరువాత ఈ పప్పును శుభ్రంగా కడిగి 4 కప్పుల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పప్పును మెత్తగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాతగిన్నెలో బెల్లం, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత నీటిని వడకట్టి మరలా గిన్నెలోకి తీసుకోవాలి. నీరు మరిగిన తరువాత బియ్యంపిండి వేసి కలపాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. తరువాత పిండిని చేత్తో బాగా కలపాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ బియ్యంపిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాళ్లుగా చేసుకోవాలి.
తరువాత మరో గిన్నెలో రెండు కప్పుల బెల్లం, 4 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత నీటిని వడకట్టి మరలా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పచ్చికొబ్బరి ముక్కలు, బియ్యం ఉండ్రాళ్లు వేసి ఉడికించాలి. ఈ ఉండ్రాలు ఉడికి పైకి తేలిన తరువాత ఉడికించిన పెసరపప్పు వేసి కలపాలి. దీనిని అడుగు మాడకుండా చిన్న మంటపై కలుపుతూ ఉడికించాలి. దీనిని కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించి యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పప్పారిది తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు పప్పారిదిని తయారు చేసి తీసుకోవచ్చు.