Parwal Masala Curry : పర్వల్.. మనకు కూరగాయల మార్కెట్ లో లభించే కూరగాయలల్లో పర్వల్ కూడా ఒకటి. ఇవి చూడడానికి అచ్చం దొండకాయల వలె ఉంటాయి. పర్వల్ లను కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటితో పప్పు, పచ్చడి, మసాలా కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పర్వల్ తో చేసే మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కూరను తినడం వల్ల మనం రుచితో పాటు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పర్వల్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పర్వల్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పర్వల్ – ముప్పావు కిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగి ఎర్రగా వేయించిన పెద్ద ఉల్లిపాయ – 1, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, కారం – 2 టీ స్పూన్స్,తరిగిన పచ్చిమిర్చి – 4.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టీ స్పూన్స్, నువ్వులు – 2 టీ స్పూన్స్, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 4.
పర్వల్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా పర్వల్ లను తొక్కతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మిగిలిన మసాలా పదార్థాలన్నీ వేసి కలపాలి. వీటిని దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఇదే జార్ లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పర్వల్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ సగానికి పైగా వేయించిన తరువాత పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి వేయిస్తూ ఉండాలి.
ఇలా ముక్కలు వేగుతుండగానే మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత వేయించిన పర్వల్ ముక్కలను కూడా వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత తగినన్నినీళ్లు , పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పర్వల్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పర్వల్ తో చేసిన మసాలా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.