Feet Health : మనలో చాలా మందికి ముఖం అందంగా, తెల్లగా ఉన్నప్పటికి పాదాలు మాత్రం నల్లగా ఉంటాయి. చాలా మంది ముఖంపై తీసుకున్నంత శ్రద్ద పాదాలపై తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎండలో తిరగడం, పాదాలపై దుమ్ము, ధూళి, మృతకణాలు పేరుకుపోవడం, పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత పాదాలు నల్లగా మారతాయి. చాలా మంది పాదాలు నల్లగా ఉండడం వల్ల వారికి నచ్చిన చెప్పులను ధరించలేకపోతూ ఉంటారు. పాదాలు నల్లగా ఉన్నవారు ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల పాదాలు తిరిగి సాధారణ రంగులోకి వస్తాయి. పాదాలపై ఉండే నలుపు, మృతకణాలు తొలగిపోయి పాదాలు అందంగా తయారవుతాయి.
ఇంట్లో ఉండే సహజ సిద్దమైన పదార్థాలతో పాదాలను తెల్లగా, అందంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాదాలు నల్లగా ఉన్నవారు ముందుగా వాటిపై ఉండే మురికి, మృతకణాలు తొలగిపోయేలా స్క్రబింగ్ చేసుకోవాలి. దీనికోసం మనం పంచదారను, నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం పాదాలను శుభ్రంగాకడిగి గోరు వెచ్చని నీటిలో ఉంచాలి. తరువాత సగానికి కట్ చేసిన నిమ్మకాయ ముక్కను తీసుకుని దానిపై పంచదారను చల్లి పాదాలపై రుద్దాలి. ఇలా 10 నిమిషాల పాటు చేసిన తరువాత పాదాలను శుభ్రంగా కడిగి తడి పోయేలా తుడవాలి. తరువాత పాదాలకు మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. అలాగే బటయకు వెళ్లిన ప్రతిసారి సన్ స్క్రీన్ లోషన్ ను రాసుకోవాలి. తరువాత ఒక టబ్ లో రెండు కప్పుల వేడి నీటిని తీసుకుని అందులో ఒక కప్పు పాలు, గుప్పెడు గులాబి రేకులు వేసుకోవాలి.
ఈ నీటిలో పాదాలను ఉంచాలి. ఇలా అరగంట పాటు ఉంచిన తరువాత పాదాలను బయటకు తీసి శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా అవ్వడంతో పాటు పాదాల రంగు కూడా మెరుగుపడుతుంది. తరువాత పాదాలకు ప్యాక్ ను వేసుకోవాలి. దీని కోసం గిన్నెలో 2 టీ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కీరదోస రసం, ఒక టీ స్పూన్ టమాట రసం, 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పాదాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. దీనిని తడి ఆరే వరకు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. తరువాత పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా తరుచూ చేస్తూ ఉండడం వల్ల చాలా సులభంగా నల్లగా ఉన్న పాదాలు తెల్లగా మారిపోతాయి.