Plain Biryani : మనకు ఫంక్షన్ లలో వడ్డించే వంటకాల్లో ప్లేయిన్ బిర్యానీ కూడా ఒకటి. దీనినే సింపుల్ బిర్యానీ అని కూడా అంటూ ఉంటారు. సింపుల్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ సింపుల్ బిర్యానీని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లోఇలా సింపుల్ బిర్యానీని తయారు చేసి తీసుకోవచ్చు. ఫంక్షన్ స్టైల్ సింపుల్ బిర్యానీని ఎల తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సింపుల్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – 2 కప్పులు, నూనె – ఒక టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 3, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, జాపత్రి – 1, నల్ల యాలకులు – 2, అనాస పువ్వు – 1, మిరియాలు – 10, లవంగాలు – 4, యాలకులు – 3, సాజీరా – ఒక టీస్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాట – 1, నీళ్లు – రెండున్నర కప్పులు, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర -కొద్దిగా, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్.
సింపుల్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగ వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. వీటిని పచ్చి వాసనపోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత నీళ్లు, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని పెద్ద మంటపై నీరంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై ఆవిరి పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సింపుల్ బిర్యానీ తయారవుతుంది. ఈ బిర్యానీని గ్రేవి కర్రీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే ఫంక్షన్ స్టైల్ సింపుల్ బిర్యానీని తయారు చేసి తీసుకోవచ్చు.