Poha Fingers : మనం అటుకులతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో తయారు చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అటుకులతో చేసుకోదగిన రుచికరమైన స్నాక్స్ వెరైటీలలో పోహ ఫింగర్స్ కూడా ఒకటి. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవలం నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అటుకులతో రుచిగా, క్రిస్పీగా ఉండే పోహ ఫింగర్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహా ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 2, నువ్వులు – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పోహ ఫింగర్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో అటుకులను వేసి వేయించాలి. వీటిని మూడు నిమిషాల పాటు వేయించిన తరువాత జార్ లో వేసి పొడి లాగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి వాటిని మెత్తగా చేసుకుని అటుకుల పొడిలో వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానంతటిని ఉండలా కలుపుకున్న తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత చేతులకు నూనెను రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ముందుగా రోల్ చేసుకోవాలి. తరువాత ఫింగర్స్ ఆకారంలో వత్తుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పోహ ఫింగర్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పోహ ఫింగర్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.