Poha Pongal : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలు తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. అటుకులతో చేసుకోదగిన తీపి వంటకాల్లో పోహా పొంగల్ కూడా ఒకటి. అటుకులు, బెల్లం, పెసరపప్పు వేసి చేసే ఈ పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, తీపి తినాలనిపించినప్పుడు ఈ పొంగల్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పొంగల్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే ఈ అటుకుల పొంగల్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహా పొంగల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పెసరపప్పు – పావు కప్పు, నీళ్లు – ఒక కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, పంచదార – 2 టేబుల్ స్పూన్స్, దొడ్డు అటుకులు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చ కర్పూరం – చిటికెడు, నెయ్యి – 2టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, కొబ్బరి ముక్కలు – కొద్దిగా.
పోహా పొంగల్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత కడిగిన పెసరపప్పు వేసి వేయించాలి. దీనిని రంగు మారే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ పప్పును మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో బెల్లం తురుము. పంచదార, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత అటుకులను జల్లించి శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కకు ఉంచాలి.
ఇప్పుడు కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి అందులో కడిగిన అటుకులు వేసి కలుపుతూ వేయించాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కరిగించిన బెల్లం నీటిని వడకట్టి వేసుకోవాలి. దీనిని దగ్గర పడే కలుపుతూ ఉడికించాలి. దీనిని 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత యాలకుల పొడి, పచ్చకర్పూరం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసికలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పోహా పొంగల్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి బలం కలుగుతుంది. ఈ విధంగా చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో అటుకులతో పొంగల్ తయారు చేసి తీసుకోవచ్చు.