పొట్లకాయలను తినేందుకు సహజంగానే ఎవరూ ఇష్టపడరు. కానీ వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. పొట్లకాయలను సరిగ్గా వండాలే కానీ వీటిని ఎవరైనా సరే ఎంతో ఇష్టంగా తింటారు. పొట్లకాయల్లో మన శరీరానికి ఎంతో ఉపయోగపడే ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. కనుక వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక పొట్లకాయలను ఉపయోగించి కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లకాయ పాలు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్లకాయ – 1, కొబ్బరినూనె – ఒక టీస్పూన్, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, కారం – ఒక టీస్పూన్, కొత్తిమీర – చిన్న కట్ట, కరివేపాకు – రెండు రెబ్బలు, పాలు – అర కప్పు, ఉప్పు – తగినంత, తాజా కొబ్బరి తురుము – పావు కప్పు, జీలకర్ర – అర టీస్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 2, ఆవాలు – పావు టీస్పూన్, ఎండు మిర్చి – 4, పసుపు – పావు టీస్పూన్.
పొట్లకాయ పాలు కూరను తయారు చేసే విధానం..
స్టవ్ మీద బాణలి ఉండి వేడయ్యాక కొబ్బరినూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించాలి. ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి ఉల్లి తరుగు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. పొట్లకాయ ముక్కలు వేసి మూత ఉంచాలి. ముక్కలు బాగా మగ్గాక ఉప్పు, మిరప కారం వేసి కలపాలి. కొబ్బరి తురుము, పాలు వేసి మరొకసారి కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించాలి. కూర బాగా దగ్గర పడిన తరువాత కొత్తిమీర వేసి దింపేయాలి. దీంతో పొట్లకాయ పాలు కూర తయారవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. దేంతో తిన్నా రుచిగానే ఉంటుంది.