పూర్వకాలంలో మన పెద్దలు ఇళ్లలో పెద్ద పెద్ద గంగాళాలు పెట్టి వాటి నుంచి నీళ్లను తీసుకుని తాగేవారు. ఇతర పనులకు కూడా నీళ్లను వాటి నుంచే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వాటర్ ఫిల్టర్లు వచ్చాయి. ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలా మంది ఫిల్టర్లను ఇళ్లలో బిగించుకుని ఉపయోగిస్తున్నారు. అది మంచిదే. కానీ వాటర్ ఫిల్టర్ అయినా, నీళ్ల బిందె అయినా సరే ఇంట్లో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలోనే ఉంచాలి. అక్కడ నుంచే నీళ్లను తాగాలి. ఇతర పనులకు ఉపయోగించాలి. లేదంటే సమస్యలు వస్తాయి.
వాస్తు ప్రకారం ఇంట్లో కిచెన్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కొందరు ఇంట్లో అన్ని గదుల్లో వాస్తు ఉండేలా చూసుకుంటారు. కానీ కిచెన్ గురించి అంతగా పట్టించుకోరు. ముఖ్యంగా కిచెన్ లో నీళ్ల బిందెలు లేదా వాటర్ ఫిల్టర్లను ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు. దీని వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. డబ్బు మంచి నీళ్లలాగే ఖర్చవుతుంది. కనుక వాటిని కిచెన్‌లో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలోనే ఉంచాలి. అప్పుడు డబ్బు ఇంట్లోకి నీళ్లలా వస్తుంది. ఎక్కువ సంపద నిల్వ అవుతుంది.
కిచెన్‌లో నైరుతి మూలలో నీళ్ల బిందెను లేదా వాటర్ ఫిల్టర్‌ను ఉంచాలి. నీళ్ల బిందెను పెట్టుకోవడం సులభమే. కానీ వాటర్ ఫిల్టర్ ఆ మూలలో కనెక్షన్ ఇవ్వడం కుదరదని అనుకునేవారు కచ్చితంగా ఏదైనా ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఆ మూల తప్ప వాటర్ ఫిల్టర్‌ను ఇంకో మూల ఎక్కడ పెట్టినా డబ్బు ఖర్చవుతుంది. ఒక్క నైరుతి మూలలోనే నీళ్ల బిందెను లేదా వాటర్ ఫిల్టర్‌ను ఉంచాలి. దీంతో అక్కడ నుంచి నీళ్లను తాగుతూ ఇతర అవసరాలకు ఉపయోగించాలి. ఈ క్రమంలో డబ్బు నీళ్లలా ఇంట్లోకి వస్తుంది. సంపద సిద్ధిస్తుంది. వాస్తు శాస్త్రం ఈ విషయాలను తెలియజేస్తోంది.