Surya Yantra : సూర్యుడు సమస్త విశ్వానికి వెలుగు ప్రదాత. సమస్త జీవులు సూర్యుడి వెలుగుపై ఆధారపడి ఉన్నాయి. సూర్యుడు లేని ప్రపంచాన్ని అసలు ఊహించలేం. మొత్తం 9 గ్రహాల కూటమిలో సూర్యుడికే అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. వారంలో ఆదివారం అత్యంత ప్రముఖమైనది. సూర్యుడు అందరికీ వెలుగును ఇవ్వడమే కాదు, శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్షును, కీర్తిని కూడా అందిస్తాడు. ఈ క్రమంలోనే ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
ఇంట్లో సూర్య యంత్రాన్ని అందరూ తిరిగే చోట అంటే హాల్లో పెట్టాలి. ఇంటి ప్రధాన ద్వారం మీద లోపలి వైపు పెడితే మంచిది. లేదా ఇంట్లోకి రాగానే సూర్య యంత్రాన్ని చూసేట్లు కూడా పెట్టవచ్చు. ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంటే ఇంకా మంచిది. సూర్య భగవానున్ని సరిగ్గా ఆరాధించాలే కానీ మనకు అనేక ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఆదివారం పూట సూర్యున్ని పూజించాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. అనంతరం సూర్యుడికి నీళ్లు సమర్పించాలి. ఆ రోజు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది.
ఆదివారం నాడు మద్యం, మాంసం ముట్టకూడదు. పొగతాగకూడదు, నిష్టతో సూర్యున్ని పూజించాలి. సూర్యున్ని పూజించినా లేదా సూర్య యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్నా అనేక ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వాస్తు దోషాలు నివారించబడతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ కలహాలకు విముక్తి లభిస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. నిత్యం సమస్యలతో సతమతం అయ్యే వారు సూర్య యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల తమ జీవన విధానంలో వచ్చే మార్పులను గమనించవచ్చు. అయితే ఆదివారం సూర్యున్ని పూజిస్తే మాత్రం చాలా నిష్టగా ఉంటారు. ఇంట్లోని అందరూ పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది.