Ragi Dosa : మనకు అందుబాటులో ఉన్న అనేక చిరు ధాన్యాలలో రాగులు ఒకటి. రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో ఇవి మన శరీరాన్ని చల్లగా ఉంచి చలువ చేస్తాయి. అంతేకాదు.. వీటిల్లో పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గించడంలో రాగులు ఎంతో సహాయపడతాయి. చాలా మంది రాగులను జావ రూపంలోనే తీసుకుంటారు. అయితే రాగులను దోశ లాగా కూడా వేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ క్రమంలోనే రాగి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, బియ్యం పిండి – అర కప్పు, పెరుగు – అర కప్పు, తరిగిన అల్లం – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – సగం టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా.
రాగి దోశ తయారీ విధానం..
ఒక పాత్రలో రాగి పిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇందులో నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలు అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి దోశ పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని కనీసం 20 నిమిషాలు నాననివ్వాలి. తరువాత పెనం మీద దోశలా వేసుకుని ఎర్రగా కాలిన తరువాత తీయాలి. వేడి వేడిగా పుదీనా చట్నీతో ఈ దోశను తింటే చాలా బాగుంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దీంతోపాటు మనకు అనేక పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. శరీరం దృఢంగా మారుతుంది. అధిక బరువు తగ్గవచ్చు. షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.