Ragi Karappusa : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే మేలు అంతా ఇంతా కాదు. నేటి కాలంలో వీటిని ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. రాగి పిండితో తరచూ చేసే వంటకాలతో పాటు మనం చిరుతిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కారపూస కూడా ఒకటి. రాగిపిండితో చేసే ఈ కారపూస చాలా రుచిగా ఉంటుంది. గుల్ల గుల్లగా రుచిగా రాగిపిండితో కారపూసను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి కారపూస తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – రెండు కప్పులు, బియ్యం పిండి – ఒక కప్పు, పుట్పాల పొడి – అర కప్పు, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రాగి కారపూస తయారీ విధానం..
ముందుగా గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వేడి నూనె లేదా బటర్ వేసి కలపాలి. బటర్ వేయడం వల్ల కారపూస గుల్ల గుల్లగా ఉంటుంది. తరువాత తగినన్ని నీళ్లు పోసుకంటూ పిండిని కలుపుకోవాలి. అయితే పిండి మరో మెత్తగా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. తరువాత మురుకుల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత ఇందులో తగినంత పిండిని ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కారపూసను వత్తుకోవాలి.
ఈ కారపూసను మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అయితే రాగి కారపూస నల్లగా ఉంటుంది కనుక ఇది చక్కగా కాలిందో లేదో మనకు తెలియదు. కారపూస కాలగానే నూనెలో వచ్చే నురుగు తగ్గుతుంది. దీనిని గమనించి కారపూసను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చయడం వల్ల ఎంతో రుచిగా గుల్ల గుల్లగా ఉండే రాగి కారపూస తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. రాగి పిండితో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కారపూసను తయారు చేసుకుని తినవచ్చు.