Ragi Pindi Set Dosa : రాగిపిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. తరచూ చేసే వంటకాలతో పాటు మనం రాగిపిండితో సెట్ దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. రాగిపిండితో చేసే ఈ సెట్ దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా ఆరోగ్యానికి మేలు చేసేలా రాగిపిండితో సెట్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగిపిండి సెట్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపండు – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పెరుగు – ఒక కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన టమాట – 1, వంటసోడా – రెండు చిటికెలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
రాగిపిండి సెట్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండి, రవ్వ, పెరుగు, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ పిండిని జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి దోశ పిండి మాదిరి మెత్తగా, పలుచగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయిని ఉంచి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని సెట్ దోశ లాగా మందంగా వేసుకోవాలి. తరువాత దీనిపై మూత ఉంచి ఎర్రగా కాల్చుకోవాలి. తరువాత దీనిని మరో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. ఇలా దోశను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి సెట్ దోశ తయారవుతుంది. దీనిని కారం పొడులు, చట్నీలు, పచ్చళ్లు ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా రాగిపిండితో అప్పటికప్పుడు రుచిగా సెట్ దోశలను తయారు చేసుకుని తినవచ్చు.