Royyapottu Vankaya Pulusu : రొయ్య పొట్టు వంకాయ పులుసు.. రొయ్య పొట్టు, వంకాయలు కలిపి చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరతో తింటే కడుపు నిండా భోజనం చేస్తారనే చెప్పవచ్చు. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ రొయ్య పొట్టు వంకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్య పొట్టు వంకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్య పొట్టు – 100 గ్రా., నూనె – 4 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – పెద్దది ఒకటి, తరిగిన వంకాయలు- పావుకిలో, పసుపు – అర టీ స్పూన్, కారం, – 2 టీ స్పూన్స్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నీళ్లు – అర గ్లాస్, సాంబార్ కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రొయ్య పొట్టు వంకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో రొయ్య పొట్టు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి నీటిని పిండేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత రొయ్య పొట్టు వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత వంకాయలు వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత సాంబార్ కారం వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య పొట్టు వంకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.