Beetroot Vepudu : బీట్ రూట్.. ఇది మనందరికి తెలిసిందే. బీట్ రూట్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా బీట్ రూట్ మనకు సహాయపడుతుంది. బీట్ రూట్ ను జ్యూస్ గా చేసి తీసుకోవడంతో పాటు దీనితో వేపుడును కూడా తయారు చేస్తూ ఉంటాము. బీట్ రూట్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కింద చెప్పిన విధంగా మసాలా పొడి వేసి తయారు చేసే ఈ వేపుడు మరింత రుచిగా ఉంటుందని చెప్పవచ్చు. బీట్ రూట్ ఫ్రైను మరింత రుచిగా, అందరికి నచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన బీట్ రూట్ – అరకిలో, ఉప్పు – తగినంత, కారం – అరటీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, పసుపు – అర టీ స్పూన్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర -అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్.
బీట్ రూట్ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత బీట్ రూట్ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీట్ రూట్ ముక్కలను మెత్తగా ఉడికించాలి. బీట్ రూట్ ముక్కలు వేగిన తరువాత పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, కారం వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. బీట్ రూట్ ను తినని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు.