Sajja Rotte : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా సజ్జలు మనకు సహాయపడతాయి. సజ్జలతో చేసుకోదగిన వాటిల్లో సజ్జ రొట్టెలు కూడా ఒకటి. సజ్జ రొట్టెలను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. చక్కటి ఆరోగ్యాన్ని అందించే సజ్జలతో రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సజ్జ రొట్టెల తయారీకి కావల్సిన పదార్థాలు..
సజ్జ పిండి – 2 కప్పులు, ఉప్పు – కొద్దిగా.
సజ్జ రొట్టెల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సజ్జ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ గంటెతో కలుపుకోవాలి. పిండి కొద్దిగా చల్లారిన తరువాత చేత్తో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చేత్తో వత్తుకోవాలి. మొదటిసారి చేసే వారు రొట్టెలు చేయడం రాని వారు పాలిథిన్ కవర్ మీద వేసి పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా ఈ రొట్టెను వత్తుకోవాలి.
చుట్టూ అంచులు పగిలిపోకుండా నెమ్మదిగా వత్తుకున్న తరువాత దీనిని వేడి వేడి పెనం మీద వేయాలి. తరువాత నీటిలో తడిపిన వస్త్రంతో రొట్టెపై ఉండే పొడి పోయేలా రుద్దుకోవాలి. తరువాత రొట్టెను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సజ్జ రొట్టెలు తయారవుతాయి. వీటిని ఏ కూరతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధి గ్రస్తులు ఇలా సజ్జ రొట్టెలను తయారు చేసుకుని తినవచ్చు.