Semiya Upma : సేమియాతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సేమియాతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సేమియా ఉప్మా కూడా ఒకటి. సేమియా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం సులభమే అయినప్పటికి దీనిని చాలా మంది పొడి పొడిగా తయారు చేసుకోలేకపోతుంటారు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల సేమియా ఉప్మా పొడి పొడిగా రావడంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. ఇలా చేయడం వల్ల బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చాలా చక్కగా చేసుకోవచ్చు. సేమియా ఉప్మాను పొడి పొడిగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – ఒక కప్పు, నూనె – 3 టీ స్పూన్స్, నీళ్లు – రెండున్నర గ్లాసులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ప్రోజెన్ బఠానీ – 2టేబు్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర చెక్క.
సేమియా ఉప్మా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడవుతుండగానే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. అదే నూనెలో సేమియా వేసి వేయించాలి. సేమియా కొద్దిగా రంగు మారగానే మరుగుతున్న నీళ్లను పోసి కలపాలి. సేమియాను ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత 2 నుండి 3 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత సేమియాను జల్లిగంటెలోకి తీసుకుని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, బఠాణీ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిపై మూత పెట్టి చిన్న మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత సేమియా, వేయించిన పల్లీలు వేసి కలపాలి. తరువాత నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా ఉప్మా తయారవుతుంది. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా దీనిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ సేమియ ఉప్మాను ఇష్టంలేని వారు ఎంతో ఇష్టంగా తింటారు.