Shanagala Kura Recipe : మనం ఆహారంగా తీసుకునే పప్పు ధాన్యాల్లో శనగలు కూడా ఒకటి. శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉడికించి లేదా నానబెట్టి తీసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఈ శనగలతో ఎంతో రుచికరమైన మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. శనగలతో రుచికరంగా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగలు – ఒక కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 ( పెద్దవి), తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన టమాటాలు – 2, ఛోలే మసాలా – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 3 టేబుల్ స్పూన్స్.

మసాలా దినుసులు..
మిరియాలు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, యాలకులు – 3, లవంగాలు – 4.
శనగల కూర తయారీ విధానం..
ముందుగా శనగలను ఒక రాత్రంతా నానబెట్టాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఇందులో టమాటముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ కళాయిపై మూతను ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత అందులో నానబెట్టుకున్న శనగలను వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత ఇందులో ఒకటింపావు గ్లాస్ నీళ్లు పోసి కలపాలి.
తరువాత కుక్కర్ పై మూతను ఉంచి 5 విజిల్స్ వచ్చే వరకు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి మరలా స్టవ్ ఆన్ చేసి ఛోలే మసాలా, కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగల కూర తయారవుతుంది. దీనిని పూరీ, చపాతీ, పరోటా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. శనగలతో ఈ విధంగా కూరను చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు శరీరంగా కూడా బలంగా తయారవుతుంది.