Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూసిన విషయం విదితమే. తన స్నేహితులతో కలిసి థాయ్ లాండ్‌లో వెకేషన్‌కు వచ్చిన వార్న్ తన గదిలో హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలాడు. తరువాత ఆయనకు సీపీఆర్ చేసి హాస్పిటల్‌కు తరలించే లోపే ఆయన మృతి చెందాడు. అయితే ఈ విషయంలో థాయ్‌లాండ్ పోలీసులు తాజాగా పలు సంచలన విషయాలను వెల్లడించారు.
షేన్‌వార్న్ కు తన గుండె సమస్య గురించి ముందే తెలుసని.. ఆయన తన గుండె సమస్యపై అంతకు ముందే డాక్టర్‌తో కూడా మాట్లాడాడని థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. అయితే వార్న్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రావల్సి ఉంది. అందువల్ల ఆయన కచ్చితంగా ఏ కారణం వల్ల చనిపోయాడో ఇంకా తెలియదని వారు వెల్లడించారు.
ఇక థాయ్ పోలీస్ అధికారి యుట్టానా వెల్లడించిన ప్రకారం.. వార్న్ కు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఆయన స్నేహితులు అక్కడే ఉన్నారని.. వారు ఆయనకు సీపీఆర్ చేశారని.. దీంతో వార్న్ చాలా ఎక్కువగా దగ్గాడని.. ఆ క్రమంలో ఆయనకు రక్తం బాగా పడిందని.. దాంతో గది నిండా రక్తమే ఉందని తెలిపారు. వార్న్‌కు స్ట్రోక్ రావడం వల్ల రక్తం కూడా బాగా పోయిందని అన్నారు. అయితే వార్న్ మృతదేహాన్ని ఇంకా ఆస్ట్రేలియాకు పంపలేదని.. అన్ని పరీక్షలు, ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆయన మృతదేహాన్ని ఆస్ట్రేలియాలోని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. వార్న్ మృతికి తాము చింతిస్తున్నామని అన్నారు.
కాగా షేన్ వార్న్ మృతి పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం విచారం వ్యక్తం చేసింది. తోటి మాజీ ప్లేయర్లు, అభిమానులు ఆయన తీసిన వికెట్లను, ఆయన సాధించిన రికార్డులను గుర్తు చేసుకుంటూ.. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.