Simple Veg Sandwich : మనం బ్రెడ్ తో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో శాండ్విచ్ కూడా ఒకటి. మనం వివిధ రుచుల్లో ఈ శాండ్విచ్ ను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన శాండ్విచ్ వెరైటీల్లలో వెజ్ శాండ్విచ్ కూడా ఒకటి. లంచ్ బాక్స్ లోకి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. 5 నిమిషాల్లో మనం వెజ్ శాండ్విచ్ ను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ వెజ్ శాండ్విచ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సింపుల్ వెజ్ శాండ్విచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి తరుగు – అర కప్పు, క్యారెట్ తురుము – పావు కప్పు, క్యాప్సికం తరుగు – అర కప్పు, మయనీస్ – పావు కప్పు, ఉప్పు – 2 చిటికెలు, మిరియాల పొడి – పావు టీ స్పూన్, బ్రెడ్ స్లైసెస్ – 4.
సింపుల్ వెజ్ శాండ్విచ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో క్యాబేజి తరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో క్యారెట్ తురుము, క్యాప్సికం తరుగు, మయనీస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటిపై ఒక టీ స్పూన్ మయనీస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత వీటిపై కొద్దిగా మిరియాల పొడిని, ఉప్పును చల్లుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ ను తీసుకుని దానిపై క్యాబేజి స్టఫింగ్ ను ఉంచాలి. దీనిపై మరో బ్రెడ్ స్లైస్ ను ఉంచి అంచులను తీసివేయాలి. తరువాత దీనిని త్రిభుజాకారంలో కట్ చేసుకుని టమాట కిచప్ తో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ శాండ్విచ్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.