Snake Gourd Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో పొట్లకాయ కూడా ఒకటి. పొట్లకాయను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ఇతర కూరగాయల వలె పొట్లకాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పొట్లకాయతో చేసుకోదగిన కూరలల్లో పొట్లకాయ కూర కూడా ఒకటి. కొబ్బరి పాలు, పొట్లకాయ కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. పొట్లకాయను తినని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. ఎంతో కమ్మగా ఉండే ఈ పొట్లకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పొట్లకాయ – పావుకిలో, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 4, పచ్చి కొబ్బరి పాలు – ఒక కప్పు, నూనె -ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -తగినంత, పసుపు – అర టీ స్పూన్.
పొట్లకాయ కూర తయారీ విధానం..
ముందుగా పొట్లకాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో రెండు నుండి మూడు సార్లు బాగా కడగాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలపాలి. తాళింపు వేగిన తరువాత పొట్లకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మరికొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మరలా మూత పెట్టి వేయించాలి. పొట్లకాయ ముక్కలు మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత కొబ్బరి పాలు పోసి కలపాలి. కొబ్బరి పాలన్నీ ఇగిరిపోయేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పొట్లకాయతో కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.