Street Style Masala Vada : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో మసాలా వడలు కూడా ఒకటి. మసాలా వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ మసాలా వడలను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే రుచిగా, క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్ మసాలా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు -ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు -ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పుదీనా -ఒక టేబుల్ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మసాలా వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును వడకట్టి ఒక గుప్పెడు పప్పును గిన్నెలోకి తీసుకుని మిగిలిన పప్పును జార్ లో వేసుకోవాలి. ఇదే జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే పక్కకు ఉంచిన పప్పును కూడా వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలపాలి.
తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడలాగా వత్తుకోవాలి. ఈ వడ మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు తయారవుతాయి. వీటిని చట్నీతో, టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన మసాలా వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.