Street Style Onion Pakoda : ఉల్లి పకోడాలు.. వీటిని ఎంతో కాలంగా మనం స్నాక్స్ గా తీసుకుంటూ ఉన్నాము. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో బండ్ల మీద, స్వీట్ షాపుల్లో ఇవి మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అలాగే వీటిని ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఉల్లిపాయ పకోడాలను తయారు చేసుకోవడం చాలా సులభం. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల అచ్చం బండ్ల మీద అమ్మే విధంగా రుచిగా, క్రిస్పీగా ఉండే ఉల్లి పకోడాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఉల్లి పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయలు – 2( మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, వాము – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, శనగపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఉల్లి పకోడా తయారీ విధానం..
ముందుగా ఉల్లిపాయలను మరీ సన్నగా, మరీ మందంగాకాకుండా పొడుగ్గా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, వాము, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత శనగపిండి, బియ్యంపిండి, వంటసోడా వేసి కలపాలి. ఇందులో నీళ్లు పోయకుండా ఉల్లిపాయల నుండి వచ్చే నీటితోనే పిండిని కలుపుకోవాలి. మరీ అవసరమైతే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీటిని పోసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని మరీ పెద్దగా కాకుండా మధ్యస్దంగా ఉండే పకోడీల లాగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఉల్లి పకోడాలు తయారవుతాయి. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన ఉల్లిపకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.