Sukhiyam : సుఖీయం.. ఎంతో పురాతనమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. పెసర్లతో చేసే ఈ సుఖీయం చూడడానికి అచ్చం పూర్ణాల వలె ఉంటాయి. సుఖీయం చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థం కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేదే. ఒక్కసారి ఈ తీపి వంటకాన్ని రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. ఈ సుఖీయాన్ని తయారు చేయడం చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ సుఖీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సుఖీయం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర్లు – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, యాలకుల పొడి – కొద్దిగా, నెయ్యి – కొద్దిగా, గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సుఖీయం తయారీ విధానం..
ముందుగా పెసర్లను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని కుక్కర్ లో వేసి నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జల్లెడలో వేసి నీరంతా పోయేలా వడకట్టాలి. తరువాత ఒక కళాయిలో బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన పెసర్లు, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. పెసర్ల మిశ్రమం దగ్గర పడిన తరువాత మరో టీ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. దీనిని మరింత దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి.
తరువాత ఇందులో ఉప్పు, పసుపు, నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన పెసర్ల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పెసర ఉండలను గోధుమపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సుఖీయం తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండగలకు ఇలా సుఖీయాన్ని తయారు చేసుకుని తినవచ్చు.