Tawa Chicken Fry : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో తవా చికెన్ ఫ్రై కూడా ఒకటి. హైదరాబాద్ స్పెషల్ అయిన ఈ తవా చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కళాయిలో, గిన్నెలో కాకుండా పెనం మీద చేసే ఈ తవా చికెన్ ఫ్రై జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభిస్తుంది. ఈ తవా చికెన్ ఫ్రైను అదే రుచితో అంతే జ్యూసీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ తవా చికెన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తవా చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 10 నుండి 12, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు -ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, యాలకులు – 5, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, టమాట – 1, నిమ్మరసం – అర చెక్క, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తవా చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద తవాను ఉంచి నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, టమాట ఫ్యూరీ, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. తరువాత 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి వేయించాలి. ఇలా పది నిమిషాల వేయించిన తరువాత మరో 50 ఎమ్ ఎల్ నీళ్లు చల్లుకుని మూత పెట్టి వేయించాలి.
మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలను పూర్తిగా వేయించాలి. చికెన్ పూర్తిగా వేగిన తరువాత మూత తీసి వేయించాలి. ఈ చికెన్ ఫ్రై తయారవ్వడానికి 45 నుండి 50 నిమిషాల సమయం పడుతుంది. చికెన్ పూర్తిగా వేగి క్రిస్పీగా అయిన తరువాత నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని పైన వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తవా చికెన్ ఫ్రై తయారవుతుంది. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగాఉంటుంది. ఈ ప్రైను ఒక్క ముక్క కూడా విడిచి పెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.