Sri Krishna : విష్ణుమూర్తి అవతారాల్లో మనకు అత్యంత ప్రీతి పాత్రమైన అవతారం కృష్ణ అవతారం. భగవంతుడు శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఆయన కథల గురించి ఎంత విన్నా కూడా ఇంకా వినాలనిపించే విధంగా ఉంటాయి. మన పూర్వీకులు నాటకాల రూపంలో, చిత్రపటాలలో మాత్రమే శ్రీకృష్ణుడిని చూసేవారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత శ్రీ కృష్ణ భగవానుడి గురించి ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు ఉంచారు ఎందరో నటులు. ఇలా శ్రీ కృష్ణ భగవాన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
కృష్ణుడు అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. దాదాపు 18 పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో కృష్ణుడిగా తెలుగు ప్రజలను మెప్పించిన నటుడు కాంతారావు. తనదైన శైలిలో కృష్ణుడుగా నటించిన కాంతారావు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఎన్టీఆర్ కి నటనలో సమానులైన ఏఎన్నార్ పూర్తిస్థాయిలో కృష్ణుడి పాత్రలో నటించలేదు. కానీ గోవులగోపన్న చిత్రంలో ఒక పాటలో కృష్ణుని పాత్రలో కనిపించారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి చిత్రంలో ఒక సన్నివేశంలో కృష్ణుడిగా నటించారు. తెలుగు తెరపై శ్రీకృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభన్ బాబు కూడా ఒకరు. బాపు దర్శకత్వంలో వచ్చిన బుద్ధిమంతుడు సినిమాలో మొదటిసారి శ్రీకృష్ణుడి వేషంలో దర్శనం ఇచ్చాడు నట భూషణ శోభన్ బాబు. ఆ తరువాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన కురుక్షేత్రం సినిమాలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు శోభన్ బాబు.
ఎన్టీఆర్ వారసుడు నందమూరి హరికృష్ణ శ్రీకృష్ణావతారం చిత్రంతో బాలకృష్ణుడి పాత్రలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పాండురంగ మహత్యం సినిమాలో విజయ నిర్మల చిన్ని కృష్ణుడి పాత్రలో నటించారు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా యశోద కృష్ణ చిత్రంలో బాలకృష్ణుడిగా నటించింది. ఈ యశోద కృష్ణ సినిమాలోనే పెద్ద శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు రామకృష్ణ. ఈయన ఎక్కువ సినిమాల్లో భగవంతుడి పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాలలో బాలయ్యబాబు కృష్ణుని పాత్రలో కనిపించారు. అదేవిధంగా అక్కినేని నాగార్జున కృష్ణార్జున చిత్రంలోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రంలోనూ కృష్ణుడిగా సామాన్యుడి పాత్రలో కనిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు యువరాజు చిత్రంలో కృష్ణుడిగా ఓ చిన్న సన్నివేశంలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.