Tomato Curry : మనం సాధారణంగా వంటింట్లో ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. టమాటాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రక్త నాళాల పని తీరును మెరుగు పరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. చర్మం, జుట్టు సంరక్షణలో కూడా టమాటాలు ఉపయోగపడతాయి. కంటి చూపు మెరుగుపడడంలోనూ టమటాలు దోహదం చేస్తాయి. హైబీపీని తగ్గించడంలో కూడా టమాటాలు ఉపయోగపడతాయి. టమాటాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఎముకలను ధృడంగా ఉంచడంతోపాటు బరువును తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. మనలో చాలా మంది టమాటాలతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు. టమాటాలతో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. టమాటాలతో కూరను కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ టమాటా కూరను విలేజ్ స్టైల్ లో మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విలేజ్ స్టైల్ టమాటా కూర తయారీకి కావల్సిన సదార్థాలు..
టమాటాలు (చిన్నగా తరగాలి) – పావు కిలో, మినపప్పు – అర టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, దాల్చిన చెక్క – కొద్దిగా, ధనియాలు – కొద్దిగా, ఎండు కొబ్బరి – కొద్దిగా, పల్లీలు – కొద్దిగా, ఉప్పు – రుచికి సరపడా, కారం – రుచికి సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
విలేజ్ స్టైల్ టమాటా కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక.. శనగ పప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి వేసి తాళింపు వేసుకోవాలి. తాళింపు వేగాక తరిగిన టమాటా ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారంను వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మూత పెట్టి మధ్యస్థ మంటపై టమాటాలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక జార్ లో దాల్చిన చెక్క, ధనియాలు, పల్లీలు, ఎండు కొబ్బరి వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికిన టమాటాలలో వేసి.. కలిపి.. మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తరువాత తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాటా కూర తయారవుతుంది. దీనిని ఉప్మా, అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
టమాటాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాల వల్ల శరీరంలో ఉండే వాపులు తగ్గుతాయి. మూత్ర పిండాలలో రాళ్ల సమస్యతో బాధపడే వారు వైద్యుల సలహా ప్రకారం వీటిని తగిన మోతాదులో ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది.