Rasam : మనలో చాలా మంది కూరతో భోజనం చేసిన తరువాత రసం వంటి వాటితో భోజనం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ రసంతో భోజనం చేసే వారు కూడా ఉంటారు. అయితే ఈ రసాన్ని రుచిగా తయారు చేసుకోవడమే కాకుండా, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేలా కూడా తయారు చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే చిన్న చిన్న జబ్బుల బారిన పడకుండా చేయడంలో ఈ రసం సహాయపడుతుంది. ఈ రసం తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 3, ధనియాలు – ఒక టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, మెంతులు – చిటికెడు, అల్లం – 1 ఇంచు (ముక్కలుగా చేసుకోవాలి) , పచ్చి మిర్చి – ఒకటి, ఎండు మిరపకాయలు – 2, కరివేపాకు – ఒక రెబ్బ, నీళ్లు – తగినన్ని, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – పావు టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు, నిమ్మ రసం – రుచికి సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రసం తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి చేత్తో పిండుతూ టమాటాల నుండి గుజ్జును తీసుకోవాలి. తరువాత ఒక జార్‌లో నీళ్లు, ఉప్పు, పసుపు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో సరిపడా నీటిని పోసుకుని అందులో ముందుగా తీసి పెట్టుకున్న టమాటా గుజ్జును, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి.. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి రసాన్ని బాగా మరగనివ్వాలి.
రసం బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కళాయిలో నూనె వేసి కాగాక.. నిమ్మ రసం, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా చేసిపెట్టుకున్న రసంలో వేసి కలుపుకోవాలి. తరువాత కొత్తిమీరను వేసుకోవాలి. ఈ రసం కొద్దిగా చల్లారిన తరువాత రుచికి తగట్టు నిమ్మ రసాన్ని వేసి కలుపుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే రసం తయారవుతుంది. ఈ రసాన్ని అన్నంతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉండడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రసాన్ని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల సాధారణ జలుబు, జ్వరం, దగ్గు తగ్గుతాయి.