Traffic Challan : పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ట్రాఫిక్ విభాగం వారు చేసిన ఆలోచన ఫలించింది. దీంతో తొలి రోజు భారీ ఎత్తున ట్రాఫిక్ చలాన్లు వసూలు అయ్యాయి. మొదటి రోజు మొత్తం రూ.5.50 కోట్ల మేర చలాన్లను వసూలు చేసినట్లు ఓ ట్రాఫిక్ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వన్ టైమ్ డిస్కౌంట్ కింద ఈ ఆఫర్‌ను అందించారు. దీంతో మొదటి రోజు మొత్తం 5 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. అయితే ఇప్పటికీ ఇంకా రూ.20 కోట్ల మేర పెండింగ్ చలాన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
తొలి రోజు పెద్ద ఎత్తున వాహనదారులు ఈ ఆఫర్ కింద చలాన్లను చెల్లించేందుకు సైట్‌ను ఓపెన్ చేయగా.. దానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా మందికి సర్వర్ ఎర్రర్ వచ్చింది. దీంతో చాలా మంది చలాన్లను చెల్లించలేకపోయారు. దీంతో రెండో రోజు సర్వర్ స్పీడ్‌ను మరింత పెంచామని అధికారులు తెలిపారు. అందువల్ల వాహనదారులకు కొంత ఇబ్బంది తప్పుతుందని పోలీసులు తెలిపారు.
ఇక వెబ్‌సైట్‌కు వచ్చే ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఈసారి ఓటీపీ ఆథెంటికేషన్ ను కూడా ప్రవేశపెట్టామని.. దీంతో సర్వర్ పై భారం తగ్గుతుందన్నారు. అలాగే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు సర్వర్ స్పీడ్ 10 రెట్లు పెరిగిందని తెలిపారు. అందువల్ల వాహనదారులకు చలాన్లను చెల్లించడంలో ఇబ్బందులు రావని తెలిపారు.
అయితే వాహనదారులు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకునేందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదని. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని.. అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక కరోనా సమయం కనుక వాహనదారులు అంత మొత్తంలో చలాన్లను చెల్లించలేకపోతున్నారని.. కనుకనే వాహనాలపై ఉన్న చలాన్ల మీద డిస్కౌంట్‌ను అందిస్తున్నామని.. హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.