Ullipaya Karam : వంటల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసుకోదగిన వంటకాల్లో ఉల్లిపాయ కారం కూడా ఒకటి. అన్నంతో, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ కారాన్ని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా 10 నిమిషాల్లో, రుచిగా ఈ కారాన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ కారాన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 7 నుండి 8, చింతపండు – చిన్న ఉసిరికాయంత, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 8, ఉల్లిపాయలు – 3( మధ్యస్థంగా ఉన్నవి).
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2.
ఉల్లిపాయ కారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై 2 నుండి 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయ మిశ్రమం చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కారంతో ఆమ్లెట్ ను వేసుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది.