Cockroaches : మనం ఎంత శుభ్రం చేసినప్పటికి ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి కీటకాలు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. ఇలాంటి కీటకాలు వాలిన పదార్థాలను తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఈ కీటకాలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ కీటకాల నుండి బయట పడడానికి మనం అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని వాడడం వల్ల ఫలితం ఉన్నప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సహజ సిద్ద పద్దతిలో కూడా మనం కీటకాలను ఇంట్లో నుండి తరిమివేయవచ్చు. దోమలు, ఈగలు, బొద్దింకలు వంటి వాటిని తరిమి కొట్టే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కా కోసం మనం కర్పూరాన్ని, సహజ సిద్ద పదార్థాలతో తయారు చేసిన అగర బత్తులను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కీటకాలను నశింపజేయడంలో కర్పూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. గాలి ద్వారా, నీటి ద్వారా వ్యాధులను కలిగించే కీటకాలను కూడా కర్పూరాన్ని ఉపయోగించి నశింపజేయవచ్చు. ముందుగా 5 కర్పూరం బిళ్లలను తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత 3 అగర బత్తులను కూడా పొడిగా చేసి ఈ రెండింటిని కలపాలి. ఇప్పుడు ముప్పావు గ్లాస్ నీటిలో ఈ పొడిని వేసి కలపాలి.
తరువాత ఈ నీటిని ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ నీటిని జల్లిగంటె సహాయంతో మరో గిన్నెలోకి వడకట్టుకుని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని బొద్దింకలు, ఈగలు, దోమలు ఉన్న చోట స్ప్రే చేయాలి. స్ప్రే బాటిల్ అందుబాటులో లేని వారు ఈ నీటిలో దూదిని ముంచి ఆ దూదిని బొద్దింకలు తిరిగే చోట ఇంట్లో మూలలకు, తలుపుల దగ్గర ఉంచాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు ఇంట్లోకి రాకుండా పోతాయి.అలాగే ఇంట్లో ఉన్న కీటకాలు బయటకు పోతాయి. మార్కెట్ లో దొరికే రసాయనాలు కలిగిన కీటక నాశనిలను వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వాడడం వల్ల ఈగలు, బొద్దింకలు, జిల పురుగులు, దోమలు వంటి కీటకాల నుండి విముక్తిని పొందవచ్చు.