Usirikaya Palli Chutney : ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. ఉసిరికాయను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ చురుకుగా పని చేస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇలా ఉసిరికాయలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడతాయి.ఈ ఉసిరికాయలతో మనం ఎక్కువగా నిల్వ పచ్చళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాము. నిల్వ పచ్చళ్లతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే చట్నీని కూడా తయారు చేసుకోవచ్చు. పల్లీలు, ఉసిరికాయలు కలిపి చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ ఉసిరికాయ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ పల్లి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉసిరికాయలు – 8, పల్లీలు – అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు – 4, పచ్చిమిర్చి – 5, నూనె – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టీ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి- 4, కరివేపాకు – ఒక రెమ్మ, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, పసుపు – పావు టీ స్పూన్స్.
ఉసిరికాయ పల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఉసిరికాయలను మెత్తగా ఉడికించి వాటిలో ఉండే గింజలను తీసేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవన్ని చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉడికించిన ఉసిరికాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
ఈ దినుసులన్నీ వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. దీనిని అంతా కలిసే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ పల్లి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఉసిరికాయతో తరచూ చేసే నిల్వ పచ్చళ్లతో పాటు అప్పుడప్పుడూ ఇలా ఇన్ స్టాంట్ గా కూడా పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు.